భారతీయ సంస్కృతిలో ఏ పని మొదలు పెట్టాలన్నా మొదట వినాయకుడిని పూజించటం సర్వ సాధారణం. కనుక మన వెబ్సైట్ కూడా ఆ విఘ్న రాజుతోనే మొదలు పెట్టాలన్నదే సంకల్పం.

వినాయకుని పేరు గాని, వినాయక చవితి పేరు గాని వినగానే పిల్లలకు బెల్లం కుడుములు,ఉండ్రాళ్లు,గారెలు,పులిహోర,పానకం లాంటి పంచభక్ష పరమాన్నాలు గుర్తొస్తే, పెద్దలకు మాత్రం చవితి దోష నివారణ పూజ గుర్తొస్తుంది. వినాయక చవితి పూజ చేయక పోతే నీలాపనిందలకు గురి కావలసి వస్తుందని విన్నపుడు వినాయకుడంటే భయం కలుగుతుంది. చవితి పూజను భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో పూర్తి చేయాలి కాని, అదో అవసరంలా, ఎగతాళిగా మాత్రం చేయకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. ఎవరేమన్నా, వినాయకుడు భక్త సులభుడు, సర్వాభీష్ట ప్రదాయకుడు అన్నది మాత్రం అక్షరాలా నిజం.

“ఏనుగమ్మా ఏనుగు..” అని పాడుతూ పసికందుల్ని ఆడించే అమ్మలు, తమకు తెలియకుండానే వినాయకుడిని స్తుతిస్తున్నారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. భగవంతుడు రూపానికి అతీతుడు, కానీ విఘ్నేశ్వరుడు మాత్రం కరి వదనంతో దర్శనమిస్తూ అందరికీ వరాలనందిస్తాడు. ఈ కరి వదనం వెనుక ఒక చక్కని కథ ఉంధి. గజాసురుడు అనే రాక్షస రాజు శివునికి పరమ భక్తుడు. అతని తపానికి మెచ్చి శివుడిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆ అసురుడు పరమ శివుడిని తన గర్భంలో నిర్భందిస్తాడు. ఆ విపత్కర సమయంలొ, దేవతలు మరియు మహా విష్ణువు నంది సహాయంతో అతడిని హతమార్చి,శివుడిని విముక్తుణ్ని చేస్తారు. ఆ తరుణంలొ భోళా శంకరుడు గజాసురునికి ఇచ్చిన వరానుసారం, పార్వతీ దేవి నలుగుతో తయారు చేసిన బాలునికి ఏనుగు ముఖాన్ని అమర్చి ప్రాణం పోస్తాడు. ఇధే ఈనాడు లోకపూజ్యమైన వినాయకుని మనోహర వదనం.

వివేకంతో, పితృ భక్తితో, అపారమైన విజ్ఞానంతో, వినాయకుడు శివుని పరీక్షలు నెగ్గి, ప్రధమ పూజార్హుడిగా, సర్వ విఘ్నాలకు అధిపతిగా స్థానాన్ని సంపాదిస్తాడు. సంతొషంతో భక్తులు సమర్పించిన భక్ష్య భోజ్యాలను తిన్న వినాయకుడిని, కదల లేక కదులుతున్న అతని భారీ కాయాన్ని చూసి, చంద్రుడు పరిహసించటంతో, ఆ దిష్టి కారణంగా వినాయకుడు మృతుడౌతాడు. పుత్ర వాత్సల్యంతో కోపించిన పార్వతీ దేవి ఎవరైనా చంద్రుడిని చూస్తే వారికి కష్టాలు తప్పవు అని శాపం పెడుతుంధి. శివ పార్వతులు కలిసి అతడికి తిరిగి ప్రాణం పోస్తారు. అదే సమయంలో భూలోకంలో శ్రీ కృష్ణుడు పొరపాటున చంద్రుడిని చూసి నీలాపనిందలను ఎదుర్కొంటాడు. ఇటువంటి కష్టాలు సామాన్య ప్రజలకు రాకూడదు అని వినాయక చవితి రోజున భక్తిగా పూజ చేసిన వారు చంద్రుడిని చూడ వచ్చు అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఇదే మన వినాయక చవితి కథ అన్నమాట..!

మేము ఆధునిక మానవులం, వైజ్ఞానిక యుగంలో ఉన్నాం, మాకు ఈ పూజలూ వద్దు, ఈ కథలు అంతకన్నా వద్దు అని అనిపించటం సర్వ సాధారణం. కానీ క్షణకాలం ఆ భావన పక్కనుంచి ఆలోచిస్తే మాత్రం ఇందులోని అంతరార్థం తెలుస్తుంది.ఈ కథలోని ప్రతి పాత్ర మనం కొరుకునే మంచి సమాజంలో ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. మన రాజకీయ నాయకులు భోళా శంకరుడిలా పేద ప్రజలకు వరాలు ఇవ్వాలి, మహా విష్ణువులా ఆపదలో ఆదుకోవాలి, శ్రీ కృష్ణుడిలా తనకొచ్చిన కష్టం ప్రజలకు రాకూడదు అని ఆలోచించాలి. వినాయకుని పితృ భక్తి, వివేకం, విజ్ఞానం యువతలో ప్రతి ఒక్కరికి ఉండాలి. వినాయకుడికి పుత్ర వాత్సల్యంతో ప్రాణం పోసిన శివ పార్వతులు, శిశు హత్యలకు పాల్పడే వారికి గుణపాఠం నేర్పాలి. ఇంటర్నెట్ యుగంలో ఉన్న మనకు ఈ కథ తెలియక పోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ పురాణాలు, కథలు అందించిన సంస్కారమే మన భారతీయ నాగరికతకు పునాది.

వినాయక చవితి భాషకు, ప్రాంతానికి అతీతమైనది. ప్రతి ఒక్క భారతీయుడు జరుపుకోవాల్సిన చక్కని పండుగ ఇధి. ఆ పండుగ జరుపుకొవటం వల్ల మనం మాత్రమే కాదు, వినాయకుని బొమ్మలు తయారు చేసే వారు, వివిధ చేతి వృత్తుల వారు, పేదలు, అన్నార్థులు వంటి ఎంతో మంది సంతోషంగా ఉంటారు. కేవలం మట్టితో చేసిన వినాయకుడిని పూజించి నిమ్మజ్జనం చేస్తే పుడమి తల్లి కూడ సంతోషిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి రసాయనాల బారి నుండి తనను కాపాడటం మనందరి బాధ్యత. కనుక గళమెత్తి చెప్దాం రండి “జై జై జై గణేశా జై జై జై.. జై జై జై వినాయకా జై జై జై…”